NationalNews

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో ఇద్దరి అరెస్టు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసుకు సంబంధించి విచారణ సమయంలో సరైన వివరణ ఇవ్వకపోవడం, ఢిల్లీ మద్యం కుంభకోణంలో వారికి ప్రమేయం ఉందన్న సాక్ష్యాలు లభించినందున బోయిన్‌పల్లి అభిషేక్‌ రావు, విజయ్‌ నాయర్‌లను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు సోమవారం తెలిపారు. వీరిని సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన ఈడీ అధికారులు బోయిన్‌పల్లి అభిషేక్‌, విజయ్‌ నాయర్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బోయిన్‌పల్లి అభిషేక్‌ ఢిల్లీ మద్యం పాలసీ విధానాన్ని రూపొందించడంలో దక్షిణాదికి చెందిన లిక్కర్‌ బరూన్‌తో లాబీయింగ్‌ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి సీఈవోగా పనిచేసిన విజయ్‌ నాయర్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్‌ ఇంచార్జ్‌గా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నారు.