NationalNews Alert

రెండు ఉద్యోగాలకు అనుమతించేది లేదు

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే విధానాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇలా ఉద్యోగాలు చేసే వారు తమ సంస్థలో సరైన నైపుణ్యాన్ని ప్రదర్శించలేరని అభిప్రాయపడింది.  ఈ విషయాన్ని ఉద్యోగులకు ఆఫర్ లెటర్‌లోనే పేర్కొన్నామని గుర్తు చేసింది. దీన్ని ఉల్లంఘించిన వారిని తొలగించడానికి కూడా వెనుకాడబోమని తెలిపింది. ఒకవేళ అదనపు ఆదాయం కోసం పనిచేయాలనుకుంటే కంపెనీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది.

మూన్‌లైటింగ్ విధానంపై ఇటీవల కాలంలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యత పెరిగింది. నైపుణ్యం గల ఉద్యోగులు కొందరు అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని పలు సర్వేలు పేర్కొన్నాయి.

స్విగ్గీ తమ ఉద్యోగులు మూన్ లైటింగ్ పాలసీని ఎంచుకోవచ్చని సూచించింది. వారి విధుల సమయం అనంతరం మాత్రమే ఇలా పని చేయడానికి అనుమతినిచ్చింది. పని వేళల తర్వాత ఉద్యోగులు ఏంచేస్తారన్నది వారి వ్యక్తిగతమని అభిప్రాయపడింది.

అయితే విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా ఇన్ఫోసిస్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌పై ప్రతికూలంగా స్పందించారు.