TTD గోశాలలో వైభవంగా గోకులాష్టమి వేడుకలు
హైందవ ధర్మంలో గోవులను సాక్షాత్తూ భగవంతుని స్వరూపంగా పిలుస్తారు. గోమాత అని మాతృస్థానం ఇచ్చి గౌరవించుకుంటారు. అలాంటి గోమాతకు భారత పురాణ, ఇతిహాసాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ గోవులను కాచుకొనే గోవిందుడు. ఇక కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారికి గోవులతో ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. పుట్టలోని శ్రీనివాసుని ఆకలి తీర్చింది గోమాతే.

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఉన్న గోవుల నుండి వచ్చే పాలను శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అధ్వర్యంలోని ఆలయాలలో పూజలు, అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇంకా టీటీడీ పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ రూపంలో అందిస్తుండడం విశేషం. నేడు శ్రీకృష్ణాష్టమే కాదు గోవులను పూజించే గోకులాష్ఠమి కూడా. ఈ సందర్భంగా TTD నిర్వహణలోని గోశాలల గురించి తెలుసుకుందాం. తిరుమల దేవస్థానములు 2002లో శ్రీవెంకటేశ్వరస్వామి గోసంరక్షణ శాలను ప్రారంభించారు. ఈ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ దాదాపు 4,300 గోవులను సంరక్షిస్తోంది. ఇవి తిరుపతిలోనే కాక తిరుచానూర్, పలమనేరుల్లో కూడా గోసంరక్షణ శాలలు ఉన్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల నుండి ఆవులను తీసుకొని వచ్చి వాటికి తగిన వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిరక్షణకు నిత్యం అందుబాటులో ఉండే పశు వైద్యాధికారులను ఏర్పాటుచేసి, శుభ్రమైన వాతావరణంలో, బలమైన దాణాను అందిస్తూ ఈ గోశాలలను నిర్వహిస్తున్నారు.

టీటీడీ ఆలయాలలో నిత్యపూజలు, అభిషేకాలు, ప్రసాదాలకు రోజూ 3వేల లీటర్ల పాలు కావలసి ఉంటుంది. దీనికోసం 500 ఆవులను భక్తుల నుండి విరాళంగా స్వీకరించారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు నెయ్యి తయారీ కేంద్రం కూడా నిర్మించారు. ఎస్వీ పశు వైద్య కళాశాల సహకారంతో పశుదాణా కర్మాగారం నిర్మిస్తున్నారు. ఇంకా ఎస్వీ వెటర్నరీ ఆసుపత్రి ద్వారా మేలుజాతి గోవులను ప్రత్యుత్పత్తి చేస్తున్నారు. కొన్ని ఇతర ఆలయాలకు ఆవు,దూడలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఉచితంగా ఆవులను, దూడలను అందిస్తోంది. భక్తులే స్వయంగా గోదర్శనం, గోపూజ చేసుకుని మేత నందించే సదుపాయాన్ని అలిపిరి, తిరుపతి గోశాలలో కల్పించారు. ఈ గోశాలకు చాలామంది భక్తులు గోవులను దానం చేస్తూ ఉంటారు. రాష్టంలో ఇంకా 26 నోడల్ గోశాలలను ఏర్పాటు చేసారు. గోకులాష్టమి పర్వదినం సందర్భంగా టీటీడీ పరిధిలోని ఎస్వీ గోశాలలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గోవులను అందంగా అలంకరించి పూజలు చేయనున్నారు. ఈసందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుతున్నారు.

