ఆ చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్.. అదానీకి భారీ రిలీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచంలోని దేశాలన్నీ ప్రభావితం చేస్తున్నారు. తాజాగా అమెరికా వ్యాపారాలకు అడ్డం కలిగిస్తోందని ఫెడరల్ చట్టంలోని అవినీతి నిరోధక చట్టాన్ని (FCPA) సస్పెండ్ చేశారు. దీనిని మరిన్ని సవరణలు, మార్పులు, మినహాయింపులతో సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. ఈ చట్టం ప్రకారం అమెరికా కంపెనీలు వ్యాపారాల కోసం విదేశాలలోని అధికారులకు లంచం ఇవ్వడం నేరం. భారత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఈ చట్టం ప్రకారమే కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనిని సస్పెండ్ చేయడం, సవరణలు చేయనుండడంతో అదానీకి ఎంతో ఊరట లభించినట్లయ్యింది. గ్రీన్ ఎనర్జీ బిజినెస్‌ల కోసం అదానీ అమెరికాలో లంచాలిచ్చారంటూ దేశవ్యాప్తంగా అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్రప్రభుత్వాలపై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.