BusinessHome Page SliderInternationalNews Alert

పనామాపై పంతం నెగ్గించుకున్న ట్రంప్..

పనామా కాలువ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టు సాధించారు. ‘అసలుకే ఎసరు పెడితే కొసరు వచ్చినట్లుగా’ పనామా కాలువలో అమెరికా నౌకలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని సాధించారు. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుండి ప్రయాణించినప్పుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా అమెరికా రక్షణ మంత్రి, పనామా పబ్లిక్ సెక్యూరిటీల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. నవంబర్‌లో ఎన్నికలలో విజయం సాధించిననాటి నుండి పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు చేస్తూండడంతో పనామా దేశంలో ఆందోళన మొదలయ్యింది. అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుండి ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఓడరేవుల్లో పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ట్రంప్ ఒత్తిడితో చైనాకు చెందిన కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మోలినో హామీ ఇచ్చారు. దీనితో ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. 1914లో అట్లాంటిక్- పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికానే ఈ పనామా కాలువను నిర్మించింది. దీనిని కొన్నాళ్లు అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో అసంతృప్తి, ఆందోళలను తలెత్తడంతో, 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నిర్ణయం మేరకు పనామాకు అప్పజెప్తూ, ఈ కాలువ తటస్థంగా ఉండాలని షరతు పెట్టారు. అలాగే దానికి ముప్పు కలిగితే అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుంది. ఈ షరతు ప్రకారమే ట్రంప్ దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.