ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్‌కు సన్మానం
ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధనలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్‌లో ట్రంప్‌కు ప్రత్యేక సన్మానం లభించింది. ఆయనకు చట్టసభ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. యుద్ధాలను ముగించే ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను శాంతి దూతగా కొనియాడారు.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో కలిసి ట్రంప్ సోమవారం జెరూసలెంలోని చట్టసభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ, బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్‌ను యూదు ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకుంటారు. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్నంతగా ఎవరూ చేయడం లేదు” అని అన్నారు. ప్రపంచానికి ట్రంప్ వంటి ధైర్యవంతులైన నేతలు అవసరమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించాలని తాము నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
తదుపరి ప్రసంగంలో నెతన్యాహు కూడా ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. “ప్రపంచాన్ని ఇంత వేగంగా కదిలించిన నాయకుడు ట్రంప్ మాత్రమే. ఆయన దృఢనిశ్చయం, నాయకత్వం వల్లే గాజా ఒప్పందం సాధ్యమైంది. ఈ శాంతి కృషి చరిత్రలో నిలిచిపోతుంది” అని తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నెతన్యాహు, ట్రంప్‌కు బంగారు పావురంను బహుమతిగా అందించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రతీకగా పావురాన్ని గుర్తిస్తారు కాబట్టి, ఆ కానుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదని అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, హమాస్ తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేయగా, ప్రతిగా ఇజ్రాయెల్ కూడా కొంతమంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇక, రెండో దశ చర్చల కోసం ఈజిప్టులో సమావేశం జరగనుంది. అందులో ట్రంప్ పాల్గొననున్నారు. అయితే, ముందస్తు కార్యక్రమాల కారణంగా నెతన్యాహు ఆ సమావేశానికి హాజరుకాకపోవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
శాంతి కోసం కృషి కొనసాగుతూనే ఉంటుందని, యుద్ధం లేని ప్రపంచం సాధించడమే తన తుదిలక్ష్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు.