దారుణంగా ధరలు పెంచుతున్న వ్యాపారులు.. ప్రభుత్వం సీరియస్..
కలాయిలో నూనె చుక్క పడనిదే రోజు గడవదు. అలాంటి వంట నూనెల ధరలు సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి. నిత్యావసర సరకులలో వంట నూనెల ధరలు వేగంగా పెరుగుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువ పడుతోంది. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. మన దేశంలో వంట నూనెల వినియోగం కూడా పెరుగుతోంది. ఆవ నూనెను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తుండగా, సన్ ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ వంటి శుద్ధి చేసిన నూనెలను పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్ కు రూ. 15-20 పెరిగాయి. పిండి వంటకలు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా రూ. 170కి చేరింది. పామాయిల్ ధర రూ. 100 నుంచి 115 -120, సన్ ఫ్లవర్ రూ. 115 నుంచి రూ. 130 – 140 కు చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు వంట నూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందనే పుకార్లతో వంట నూనె ధరలు దారుణంగా పెంచి వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్రమ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.