ముక్కోటి దేవతలు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి నేడే..
జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై భూలోకానికి తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు ఆయనను దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు దిగి వస్తారు. అందుకే ఈ రోజును పరమ పవిత్రమైన దినంగా భావించి భక్తులు ఉత్తర ద్వారం నుండి వైకుంఠనాధుని దర్శనాలకు తహతహలాడుతారు. ఎందుకంటే ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే శాశ్వత వైకుంఠ వాసం కలుగుతుందని, స్వామివారి కైంకర్యాలలో నిత్యం పాల్గొనాలని భక్తులు కోరుకుంటారు. పూర్వం మధుకైటభులు అనే రాక్షసులను సంహరించిన మహా విష్ణువు వారిని ఉత్తర ద్వారం నుండి పరమపదంలోకి తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించారు. విష్ణు శరీరం నుండి యోగనిద్రలో పుట్టిన ఏకాదశి అనే శక్తికి ఇచ్చిన వరం ప్రకారం విష్ణువు నేడు ఉపవాసం ఉన్నవారి పాపాలను కడిగేస్తానని మాట ఇచ్చారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చాలా ప్రధానం.

