నేడే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జన్మదినం -హైదరాబాద్‌లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ
భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతిని దేశవ్యాప్తంగా నేడు జరుపుకుంటున్నాము. దేశంలోని నిమ్నవర్గాలకు, దళిత జనుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిన మహానుభావుడు. ఆయన అంటరానికులంలో పుట్టి వివక్షతను, సామాజిక దురాచారాన్ని ఎదుర్కొన్న ధీరోదాత్తుడు. సామాజిక అసమానతలను దూరం చేయాలనే ఉద్దేశ్యంతో ఉద్యమించి, హక్కులు సాధించిన దళితబాంధవుడు అంబేడ్కర్.

ఆయన స్మృతి చిహ్నంగా తెలంగాణా ప్రభుత్వం ఒక గొప్ప కార్యాన్ని చేపట్టింది. ఆయన జ్ఞాపకంగా కొత్తగా కట్టే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడమే కాకుండా, ఆయన్ని సమున్నత విగ్రహంగా తీర్చిదిద్దింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తున ఆయన జ్ఞాపకాన్ని అందించింది. ఈ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహం పార్లమెంట్ భవనం ఆకారంలో ఉన్న పీఠంపై ఉంటుంది. దానిపై 125 అడుగుల ఎత్తున లోహ విగ్రహం ఉంటుంది. దీనిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఆవిష్కరించబోతున్నారు.

ఈ విగ్రహానికి 146 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. దీనికోసం హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ పక్కన గల 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో దీనిని నిర్మించారు. ఈ విగ్రహనిర్మాణానికి 791 టన్నుల ఉక్కును,96 అడుగుల మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ప్రతీరోజూ 425 మంది కార్మికులు పనిచేశారు. ఈ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ కూడా రానున్నారు. రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్కొంటారు. 30 మంది బౌద్ధగురువులతో ప్రార్థనలు జరిపిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా పుష్పవర్షం ఏర్పాటు చేశారు. ఈ అంబేడ్కర్ విగ్రహం లోపల ఆడిటోరియంలో ఆయన జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇచ్చిన పథకాలను గురించి కేసీఆర్ ప్రసంగిస్తారు.

