బీజేపీ లో చేరాలంటే రాజీనామా చేసి రావాలి
తెలంగాణలో యూరియా సరఫరా సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనతో మాట్లాడి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారని, రావాల్సిన వాటా తప్పకుండా పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే రామగుండంలో సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తి ఆగిపోయిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ సహా ఏ చర్యలు తీసుకుంటారో చూస్తామని చెప్పారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ల పార్టీల మార్పు అంశం సాధారణమే అని , కానీ బీజేపీలో చేరాలంటే ముందుగా రాజీనామా చేయాలనే నిబంధన ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు రెండూ సమానమే అని ఎద్దేవా చేశారు . హైదరాబాద్ మెట్రో ప్రస్తుతానికి నష్టాల్లో నడుస్తోందని, కొత్త లైన్ వేసేందుకు ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదని అన్నారు. అయితే మెట్రో రెండో దశకు కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక ఓటర్ లిస్ట్ సవరణలో భాగంగా ఎస్ఐఆర్ తప్పనిసరిగా జరగాలని, హైదరాబాద్‌లో నాలుగు లక్షల డబుల్ ఓట్లు తొలగించాల్సి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేము ఓట్లు దొంగిలించామంటే మా ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ బీహార్‌లో బీజేపీదే అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎందుకో వారికే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

