పార్టీకి ఆక్సిజన్ ఎక్కించాలంటే .. నేత నడవాల్సిందేనా..?
వ్యాయామం అనేది మనుషులే కాదండోయ్.. పార్టీలు చేయాల్సిందే . చక్కగా గుండె కొట్టుకోవాలన్నా.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నా .. మనస్సు దృఢమవ్వాలన్నా.. కావాల్సింది వ్యాయామం. అందులోనూ నడక. మెదడు ప్రభావితమై.. ఆక్సిజన్ పుష్కలమై.. రక్తప్రసరణ పెరిగి .. రక్త పోటును తగ్గించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నడక ఎంతో ఉపకరిస్తుంది. అదే ఓ రాజకీయ పార్టీకి సారధ్యం వహించే ఓ నేత నడిస్తే.. ఆ పార్టీ కూడా ఆరోగ్యవంతంగా .. పది కాలాల పాటు జనం మధ్యన, జనం నీడలో.. జనం కోసం నిలబడుతుందని, పదవీ వైభవంతో అలరారుతుందని గత అనుభవాలు ఎన్నో చెబుతున్నాయి. ఆ అనుభవాలనే స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు చాలా మంది నేతలు అనుసరిస్తున్నారు. ఆచరిస్తున్నారు. నడిస్తే ఆలోచనలు పెరుగుతాయి. అవగాహన పెరుగుతుంది. దీనికి తోడు అధికారమూ లభిస్తుంది. ఇదో.. సెంటిమెంట్ వ్యాయామం. ఇప్పుడు అందరూ అనుసరిస్తున్న విధానం. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఏ పార్టీ అయినా బతికి బట్టకట్టాలంటే నేత నడవాల్సిందే. నడక సాగించాల్సిందే. ఇప్పుడు ఇదే ఆలోచనతో ఉన్నారు నారా లోకేష్ బాబు.. పవన్ కల్యాణ్ బాబు.

ఎప్పుడో కొన్ని శతాబ్దాలక్రితం ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని కాలంలోనే కాశీ యాత్రలు చేసేవారు. అప్పట్లో ఓ నానుడి కూడా ఉంది కాశీకి పోయినా ఒకటే.. కాటికి పోయినా ఒకటే అని. అంత కష్ట సాధ్యంగా ఉండేది కాశీయాత్ర. ఆది శంకరాచార్యులు లాంటి మహనీయులు కాలి నడకన దేశం మొత్తం తిరిగి.. ఆధ్యాత్మికతను పెంచారు. బలమైన భక్తి బీజాలను నాటారు. సంస్కృతి సంప్రదాయాల విలువలను పెంచారు. వారి నడక ప్రభావం అలాంటిది. ఇక స్వాతంత్య్ర సమర కాలంలో ఉద్యమ దీప్తులు వెలిగించేందుకు మహాత్మాగాంధీ లాంటి దేశభక్తి పరాయణులు కూడా వేల మైళ్ళు నడిచారు. తెల్ల దొరల బానిస సంకెళ్ళను తెంచి.. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించారు. ఆ నడకలో ఉన్న స్ఫూర్తి అలాంటిది. ఆ తర్వాత నడక తడబడినా.. ఇప్పుడు మళ్ళీ నడవాలన్నా కాంక్ష బలంగా పెరుగుతోంది. కారణం సమాజాన్ని మార్చాలని.. సమాజాన్ని చైతన్యవంతం చేయాలని.. సమస్యలను తెలుసుకుని, జనం బాగోగుల కోసం పాటుపడాలని.. తన లక్ష్యాన్ని , ఉద్దేశాన్ని జనంలోకి తీసుకు వెళ్ళాలని .. తానున్న పార్టీకి సద్గతి కల్పించాలని ఇలా ఎవరి ఆలోచనలు వారివి. ఆరోగ్యం కోసం నడిచే నడకలతో పార్కులు కిటకిట లాడుతుంటే .. నేతల నడకలతో రహదారులు రద్దీగా మారుతున్నాయి. లక్ష్యం ఏదైనా వారు నడుస్తూ .. తన పాటు మరికొందరిని కూడా నడిపిస్తూ వారి ఆరోగ్యాలపై కూడా దృష్టి పెట్టడం సంతోషం.

వ్యక్తిగా నడిస్తే నడక.. నేతగా నడిస్తే పాదయాత్ర. గత కొద్ది సంవత్సరాలుగా పాదయాత్రల జోష్ పెరిగింది. పాదయాత్రలకు ఓ ప్రాధాన్యత తీసుకు వచ్చిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వై.ఎస్. రాజశేఖరరెడ్డినే. 2003లో రాష్ట్రం మొత్తం ఆ చివర నుండి ఈ చివరి వరకు నడిచి .. కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకు వచ్చిన నేతగా మాంచి గుర్తింపు సాధించారు. అంతేకాదు తెలుగుదేశం ఉధృతిని తగ్గించి, తిరిగి కాంగ్రెస్ ను అధికార పీఠంపైకి ఎక్కించారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కాంక్షనూ తీర్చుకున్నారు. వారసత్వ రాజకీయాలకు బలమైన పునాదులూ వేశారు. ఓ నడక ఎన్ని రకాలుగా లాభాన్ని చేకూర్చిందో దీనిని బట్టి అర్ధం అవుతోంది. ఆ తర్వాత కూడా నడిచి .. సారీ.. పాదయాత్రలు చేసి .. ముఖ్యమంత్రులు అయిన వారు ఇద్దరున్నారు. వారిలో టీడీపీ నేత చంద్రబాబు ఒకరు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలంటే నడక తప్పదనుకున్నాడు. 2013లో పాదయాత్ర పేరుతో ఆయన కూడా ఎన్నో వేల మైళ్ళు నడిచీ నడిచీ పార్టీకి ఓ కళ తీసుకు వచ్చాడు. తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుని పాలన సాగించాడు.

ఇక 2017లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఓదార్పు యాత్ర పేరుతో కాళ్ళకు బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగారు. ఎండా వానా లెక్క చెయ్యకుండా 3648 కి.మీ నడిచి .. వైసీపీ పార్టీని అధికారానికి దగ్గర చేశాడు. తండ్రి మరణం తర్వాత సునాయాసంగా సీఎం పదవి తనకే వస్తుందని భావించిన జగన్.. ఆతర్వాత వేల కిలో మీటర్లు నడిస్తే కానీ ఆ కోరిక తీరలేదు. అలా తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి .. జగన్ మోహన్ రెడ్డి తన చిరకాల కోర్కెను నెరవేర్చుకున్నాడు. మొత్తం 175 స్ధానాలున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 151 నియోజకవర్గాల్లో విజయభేరిని మోగించింది జగన్ పార్టీ. ఇది అనూహ్య విజయమే. ఇక జగన్ సోదరి షర్మిల కూడా ఏపీలో పాదయాత్ర చేపట్టినా .. కాళ్ళ నొప్పులు తప్పించి, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి సొంత అన్న కూడా ఆమె కష్టాన్ని గుర్తించ లేదు సరికదా .. చివరికి ఎంపీ, ఎమ్మెల్యే లాంటి పదవిని కూడా కట్టబెట్టలేదు. వేచి చూసీ చూసీ.. చివరికి తెలంగాణ వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. మరి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో ..ఫర్మిలను ఎక్కడకు తీసుకు వెళుతుందో చూడాలి.

ఇక చంద్రబాబు వారసునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నారా లోకేష్ దృష్టి కూడా ఇప్పుడు పాదయాత్రల మీద పడింది. తానూ నడవాలి. నడిచి పార్టీని నిలపాలి. పార్టీకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలంటే తాను నడవక తప్పదు. డాడీ నడిచి సీఎం అయ్యాడు. తానూ నడిచి ఆ పదవి చేపట్టాలి. టీడీపీకి పూర్వ వైభవం తేవాలి ఇదే లక్ష్యంతో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్నికల లోగా పాదయాత్ర పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో ఆయన అనుచరులు అనుకుంటున్న మాట. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేయాలన్న భావనను వ్యక్తం చేసినా.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా బస్సు యత్ర ఎలా ఉంటుందా అన్న కోణంలో కూడా జనసేన ఆలోచన చేస్తోంది. ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. ఇప్పుడు పాదయాత్రలు మొదలు పెడితే .. ఎన్నికల సమయానికి పూర్త అవుతుందో కాదు తెలియని పరిస్ధితి. అందుకే ఆ దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు.

ఇక ఎప్పటి నుండో దక్షిణాది మీద కన్నేసిన కమలనాధులు.. పార్టీని అధికార పీఠం పైకి ఎక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా పాదయాత్ర సాగిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పై విమర్శల బాణాలను ఎక్కు పెడుతూ .. సమస్యలను ఎలుగెత్తి చాటుతూ సాగుతున్న ఆయన పాదయాత్ర ఆసక్తిగా మారింది. మరోవైపు పార్టీకి ఆక్సిజన్ ఎక్కించి .. తిరిగి ట్రాక్ మీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్ని చేసినా అన్నీ వికటిస్తున్నాయి. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆసక్తి తగ్గి పోయింది. ఓట్లు రాలడం ఆగిపోయింది. సీట్లు గెలవడం తగ్గి పోయింది. చిన్న చితకా పార్టీల కంటే పూర్తిగా కాంగ్రెస్ వెనబడి పోయింది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఉన్న శోభ క్షీణించి పోయింది. వైభవం మసకబారి, మసి పట్టి పోయింది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ పెద్ద సాహసానికి పూనుకున్నాడు. మిలే కదమ్.. జుడే వతన్ అంటూ దేశవ్యాప్తంగా 3500 కిలో మీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇందుకు సెప్టెంబర్ 7న ముహూర్తం నిర్ణయించి .. వీర తిలకం దిద్ది .. రాహుల్ ను పాదయాత్రకు సాగనంపనుంది కాంగ్రెస్.

ఇక చిన్నా చితకా పార్టీలు ఎన్నో పాదయాత్రలు చేశాయి. ఎంతో మంది నెలల కొద్ది జనం మధ్య నడిచారు. కానీ ప్రతిఫలం పొందిన వారు తక్కువ మంది. ఆయా పార్టీలను ప్రజలు ఆదరించింది కూడా తక్కువే. కాలం కలిసి రావాలి. నడక సజావుగా సాగాలి. జనం ఆదరించాలి. జేజేలు కొట్టాలి. అప్పుడే ఆ నడకకు, ఆ నడతకు సాఫల్యం దక్కేది. ఆయా పార్టీలు ప్రజా మెప్పును పొంది పీఠం ఎక్కేది. చూద్దాం.. భవిష్యత్ ఎలా.. ఎవరిని .. ఎప్పుడు జనం మధ్యకు తీసుకు రాబోతోందో. అధికార పగ్గాలను అప్పగించబోతోందో.
