ఏలూరు జిల్లాలో పులి పిల్లల కలకలం..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద అగిరిపల్లి మండలంలో పులి పిల్లలు కలకలం సృష్టించాయి. ‘ఇదిగో తోక అంటే -అదిగో పులి’ అన్నట్లు పులి పిల్లలు కనిపించాయంటే పులి వచ్చేస్తుంది.. అని అక్కడ బాగా పుకార్లు చెలరేగాయి. సగ్గూరు, కృష్ణవరం ప్రాంతాలలోని ప్రజలు ఈ సంగతి తెలిసి భయభ్రాంతులయ్యారు. విషయమేంటంటే కొందరు రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు అటవీ ప్రాంతంలో పులి పిల్లలను గుర్తించారు. వాటి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీటిని చూసి స్థానికులు భయపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే ప్రాంతంలో అడవి పందుల ఉచ్చులో ఒక చిరుత పులి చిక్కుకుని చనిపోవడంతో అది నిజమేనని ఆ ప్రాంతంలో పులులు ఉన్నాయని నమ్మారు. అయితే అటవీ అధికారులు ఆ పిల్లలను పరిశీలించి, అవి పులి పిల్లలు కాదు, అడవి పిల్లి పిల్లలని తేల్చారు. వాటి స్థలం మార్చకూడదని, వాటి తల్లి వచ్చే ముందే వాటిని అక్కడ ఉంచాలని, లేకపోతే తనవి కాదని వదిలేస్తుందని అటవీ సిబ్బంది పేర్కొన్నారు.

