నిబద్ధత ఉన్నవారికే టికెట్లు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. పార్టీ భావజాలాన్ని నమ్మి, కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని పనిచేస్తున్న వారందరూ తమ పార్టీ వారేనని ఆయన పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు క్రమశిక్షణతో, నిబద్ధతతో పార్టీ కోసం శ్రమించే వారికే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయం చేసుకుని, అందరి ఏకాభిప్రాయంతో పేర్లను ఖరారు చేయాలని ఆయన సూచించారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ పేరుతో ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులను మంజూరు చేశామని, ఆరు గ్యారెంటీలలో మెజారిటీ హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తుది నిర్ణయం తీసుకుంటారని భట్టి తెలిపారు. ఇక మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సీఎం, డిప్యూటీ సీఎం , కేబినెట్ అంతా ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నామని, పాలనపరమైన అంశాల కోసమే తాము భేటీ అయ్యామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

