దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు, ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు గతంలోనే ‘క్లీన్ చిట్’ లభించగా, ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్‌ల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కార్యాలయం విచారణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ విషయంలో ఆధారాలు బలంగా ఉండటంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆయన ఒక అడుగు ముందుకేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

