ఎమ్మెల్యే కోసం ముగ్గురు మంత్రులు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
 - ముగ్గురు మంత్రులకు కీలక బాధ్యతలు
 - ఒక్కో మంత్రికి రెండు డివిజన్ లు కేటాయింపు
 - గెలుపే లక్ష్యంగా.. స్థానిక నేతకే అవకాశం
 
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. ఈ ఉపఎన్నికలో విజయం సాధించి, గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీకి తిరిగి పునాదులు వేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార మంత్రులైన పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లను జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇన్‌చార్జిలుగా నియమించింది. మంత్రి పొన్నం కు ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మంత్రి తుమ్మల కు వెంగల్‌రావు నగర్
, సోమాజిగూడ, మంత్రి వివేక్ కు బోరబండ,షేక్‌పేట్ రెండు డివిజన్లు చొప్పున బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఒక్కొక్క మంత్రికి ఆరుగురు చొప్పున రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను సమన్వయకర్తలుగా నియమించింది. మొత్తం 19 మంది చైర్మన్లు ఈ ప్రచార బృందంలో భాగమయ్యారు.ఈ బృందం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచార కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రచారానికి ముందుగానే వ్యూహం రూపొందించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇంటింటి ప్రచారం, బూత్ స్థాయి సమావేశాలు, సామాజిక వర్గాల నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, నీటి సమస్యలు, మెట్రో లైన్ విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రచారం చేయనున్నారు. ఇక ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కొనేందుకు ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. మైనార్టీలు, బీసీలు, గిరిజనులు వంటి వర్గాల మద్దతు పొందేందుకు ప్రత్యేక సమన్వయ బృందాలు రంగంలోకి దిగి పని చేస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన కీలక నేతల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఎంపిక చివరి దశకు చేరిన కాంగ్రెస్, స్థానికంగా బలమైన నాయకుడిని పోటీకి దింపేందుకు ప్రయత్నిస్తోంది.  ఈ ఉపఎన్నిక ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచాలని, నగర అభివృద్ధికి కాంగ్రెస్ పాలన అవసరమని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నది పార్టీ ధ్యేయంగా ఉంది. గ్రేటర్ పరిధిలో బలపడాలంటే, జూబ్లీహిల్స్‌లో విజయమే కీలకం అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపే తన శక్తిని పూర్తిగా సమీకరిస్తోంది.

