Home Page SliderNational

రతన్ టాటాను చంపేస్తామంటూ బెదిరింపు కాల్

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల గుర్తు తెలియని ఓ వ్యక్తి ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి రతన్ టాటాకు ప్రాణహాని ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టాటా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని లేదంటే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీలాగే అవుతుందని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన  ముంబయి పోలీసులు వెంటనే రతన్ టాటా భద్రతను పెంచడంతోపాటు కొన్ని తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.ఈ దర్యాప్తులో ఈ ఫోన్ కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు పూణెకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చి కర్ణాటకలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతను కర్ణాటక నుంచి ముంబయి పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.