Home Page Sliderhome page sliderInternationalNewsTrending Todayviral

అమెరికాకు రాజమార్గం ఈ ఓ-1 వీసా..ఎలా సంపాదించాలంటే?

అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను ఈ మధ్య తెగ ఆకర్షిస్తోన్న వీసా ఇది. అమెరికాకు వెళ్లడానికి రాజమార్గం లాంటి ఈ వీసా కోసం భారత వృత్తి నిపుణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయంగా మారిన ‘ఓ-1’ వీసా కోసం భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏంటీ వీసా? ఎవరికి ఇస్తారు? అనేది తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి (USA) వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నవేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్‌ అవుతోంది. అదే ఓ-1 వీసా (O-1 visa). యూఎస్‌ ఇమిగ్రేషన్‌ యాక్ట్‌ 1990 కింద ఈ ఓ-1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్‌, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌ (O-1A), ఆర్ట్స్‌ అండ్‌ ఫిల్మ్‌ (O-1B) అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించినవారికి ఈ వీసాలను మంజూరుచేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు.. నిర్ణయించిన ఎనిమిది కఠిన ప్రమాణాల్లో కనీసం మూడైనా కలిగిఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం లేదా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగిఉండటం, మీడియా కవరేజీ వంటివి ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ వీసాకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ విధానం గానీ, పరిమితులు గానీ లేకపోవడంతో వీసా రాదన్న భయం ఉండదు. ఏటా దరఖాస్తుదారుల్లో 93 శాతం మందికి వీసాలు మంజూరుచేస్తుంటారు. అదే హెచ్‌-1బీ అయితే ఆమోదిత రేటు కేవలం 37 శాతమే. ఓ-1 వీసాను తొలుత మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు. దీన్ని ‘లాటరీ లేని హెచ్‌-1బీ వీసా’గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాను పొందడం కష్టతరమవుతున్న సమయంలో భారత సైబర్‌ నిపుణులు, ఏఐ రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు ఈ ఓ-1 వీసాను అమెరికాకు వెళ్లేందుకు దగ్గరి దారిగా భావిస్తున్నారు. అటు గూగుల్‌, టెస్లా, ఓపెన్‌ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఓ-1 వీసా రూట్‌లో నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హార్వర్డ్‌, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ, రీసెర్చర్ల కోసం ఓ-1 వీసాతో నైపుణ్యం గల వారిని నియమించుకుంటున్నారు. లాటరీ సమస్య లేకపోవడం, వీసా జారీ రేటు అత్యధికంగా ఉండటంతో భారత వృత్తి నిపుణులు ఎక్కువగా ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. ఏటా ఈ వీసాల జారీ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 ఓ-1 వీసాలను జారీ చేయగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 18,994కు పెరిగింది. అయితే, దీని దరఖాస్తు రుసుము మాత్రం 10వేల డాలర్ల నుంచి 30వేల డాలర్లుగా ఉంది. సాధారణంగా హెచ్‌-1బీ దరఖాస్తుకు అయ్యే ఖర్చు 970 డాలర్ల నుంచి 7,775 డాలర్లుగా ఉంటుంది. ఈ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్‌, బ్రెజిల్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. 2020లో 487 మంది భారతీయులకు ఓ-1 వీసా రాగా.. 2023 నాటికి ఆ సంఖ్య 1418కి పెరిగింది.