ధనుంజయ్ ముండే రాజీనామా ఇందుకే..
మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లాలోని సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండేపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ ఆదేశించారు. దీనితో ఆయన తన రాజీనామాను సమర్పించారు. సీఎం దానిని ఆమోదించి, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని వెల్లడించారు. ధనంజయ్ ముండే సొంత జిల్లాలోని బీడ్‌లోని మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి, తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌పై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. దీనితో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ధనుంజయ్ ముండే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలకనేతగా ఉన్నారు. అయితే అదే పార్టీకి చెందిన కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా ఆయన రాజీనామాకు డిమాండ్ చేయడం విశేషం.