రాష్ట్ర ప్రజలకు ఇదే ఆఖరి ఛాన్స్…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడైనా తన మాట వినాలని… ఇప్పటికీ తన మాట వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయిలో ‘ఇదే ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తారని ఆనాడే ప్రజలకు వివరించానని గుర్తు చేశారు. ముద్దులు పెడుతున్నాడని ప్రజలు మోసపోకూడదన్నానని.. గెలిచిన తర్వాత పిడిగుద్దులుంటాయని స్పష్టంగా చెప్పానని తెలిపారు. ఆనాడు తాను చెప్పిందే ఇవాళ జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారని… అందుకే ‘ఇదే ఖర్మ మన రాష్ట్రానికి’ అని కార్యక్రమాన్ని తీసుకొచ్చానని తెలిపారు.

రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని… ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం చేశానని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడున్న మంత్రికి డయాఫ్రం వాల్ అంటే ఏంటో కూడా తెలీదని.. అదేదో ఆకాశంలో ఉంటుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన బాధంతా రాష్ట్రం కోసమేనని చంద్రబాబు తెలిపారు.