ఆడాళ్లూ…మీకు జోహార్లు
ఇది అందరి ఆడవాళ్లను ఉద్దేశించి మాత్రం కాదు. కేవలం కొంతమందికి మాత్రమే వర్తించే అంశం. ఆకాశంలో సగం అన్నారు..అవకాశాల్లో సగం అన్నారు.. అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు అని మేధావులు సైతం స్త్రీల గురించి చెప్పుకొచ్చారు. ఎందుకంటే స్త్రీల భద్రతే దేశంలో ప్రధానం అనుకున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు స్త్రీలు మర్డర్లలో కూడా సగ భాగం తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది భార్యలు, తమ భర్తల పాలిట లేడీ కింకరులుగా మారుతున్నారు.
ఒకప్పుడు ఆడపిల్లల తండ్రులు అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ కోసం ఆరా తీసేవారు. అబ్బాయికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా.. ఉద్యోగం ఉందా, లేదా.. ఆ ఇంటికి వెళ్తే తమ బిడ్డ క్షేమంగా ఉంటుందా ఉండదా లాంటివి వాకబు చేసేవారు. ఇప్పుడిదే పనిని అబ్బాయి తల్లిదండ్రులు చేయాల్సి వస్తోంది.
తమ ఇంటికొచ్చే అమ్మాయి ఎలాంటిది.. ఆమెకు ఏమైనా ఎపైర్లు ఉన్నాయా.. ఆమె సోషల్ మీడియా ఖాతాలేంటి.. అందులో ఆమె పెడుతున్న పోస్టులేంటి.. ఆఫీస్ లో ఆమె ఎలా ఉంటుంది.. లాంటి వివరాల్ని ఆరా తీయాల్సిన పరిస్థితికి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలతో అబ్బాయిలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి దాపురించింది. లేదంటే పెళ్లి తర్వాత భార్య చేతుల్లో శవంగా మారాల్సి వస్తోంది.
ఇటీవల జరిగిన మేఘాలయ మర్డర్ కేసు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఓ అబ్బాయితో ఎఫైర్ లో ఉంటూ, రాజా రఘువంశీని పెళ్లాడింది సోనమ్. ఆ తర్వాత హనీమూన్ పేరిట అతడ్ని మేఘాలయ తీసుకెళ్లి, సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, హత్య చేయించడం ఎందుకు? ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని రాజా రఘువంశీ ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది.మరోపక్క పాణ్యంలో కూడా ఇదే జరిగింది. ఆల్రెడీ బ్యాంకు ఉద్యోగి తిరుమల రావుతో రిలేషన్ షిప్ లో ఉంది ఐశ్వర్య. అయినప్పటికీ తేజేశ్వర్ ను పెళ్లాడింది. పెళ్లయిన నెల రోజులకే తిరుమల రావు వేసిన స్కెచ్ కు తేజేశ్వర్ విగతజీవిగా మారాడు. పూర్తిగా ఐశ్వర్య అంగీకారంతో, ఆమె సూచనలు-సలహాల మేరకు జరిగిన మర్డర్ ఇది. ఇందులో తేజేశ్వర్ చేసిన తప్పు ఏంటి?అంతేకాదు హర్యానాలోని రోహ్ కత్ జిల్లాలో జరిగిన ఘటన మరీ దారుణం. మగన్ అలియాస్ అజయ్ ను ప్రేమించి పెళ్లాడింది దివ్య. పెళ్లయిన ఏడాదికే మగన్ బోర్ కొట్టేశాడేమో, దీపక్ అనే పోలీస్ కు కనెక్ట్ అయింది. అప్పట్నుంచి మగన్ ను మానసికంగా హింసించడం మొదలుపెట్టింది. దీపక్ తో అత్యంత సన్నిహితంగా దిగిన వీడియోల్ని మగన్ కు పంపించడం మొదలుపెట్టింది. ప్రపంచంలో ఏ భార్య చేయకూడని పని ఇది. ఆస్తులన్నీ అమ్మేసి తనకు డబ్బులివ్వాలని, లేదంటే వీడియోల్ని బంధువులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియని మగన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలు మరవక ముందే మరో ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రయాగ్ రాజ్ కు చెందిన నిషాద్ ను పెళ్లాడింది సితార అనే యువతి. సరిగ్గా ఫస్ట్ నైట్ వచ్చేసరికి కొంగులోంచి కత్తి తీసింది. టచ్ చేస్తే 35 ముక్కలు చేస్తానంటూ బెదిరించింది. దీనికి కారణం, ఆమె ఆల్రెడీ మరో వ్యక్తితో లవ్ లో ఉండడమే. ఇది జరిగిన 5 రోజులకే ప్రియుడితో కలిసి పారిపోయింది సితార.మరో ఘటనలో ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది ఓ యువతి. చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రెనే జోషిల్దా.. సహోద్యోగి ప్రేమను తిరస్కరించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు సృష్టించి పలు రాష్ట్రాలకు చెందిన స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపించింది.
అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. జస్ట్ 2 నెలల కిందట పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని, అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చింది భార్య. ఈ కేసులో సురేష్ భార్య 37 ఏళ్ల అనితను, ఆమె ప్రియుడు 34 ఏళ్ల ఫక్రుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్నటికి నిన్న హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తోందన్న కారణంతో పదో తరగతి చదువుతున్న కుమార్తె, ఆమె ప్రియుడు, అతని సోదరుడితో కలిసి తల్లినిదారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనలన్నీ కేవలం 10 రోజుల్లో జరిగిన సంఘటనలు. ఇవన్నీ
చూస్తుంటే, కొంతమంది మహిళల మైండ్ సెట్ మారిందేమో అనిపిస్తుంది.