“ఇది సినిమా కాదు పవన్” -పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యేపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడలో సోమవారం నాడు జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఇది సినిమా కాదు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి” ముందు తానూ ఒక్కసారైనా గెలిచి ఆ తరువాత నీతులు మాట్లాడాలని అన్నారు. తాను రౌడీనే అయితే సిటీలో పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఉన్న జనసేన బ్యానర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయ నాయకుడు అయితే మొదట ఎమ్మెల్యే గా గెలవాలని సవాల్ చేశారు. పార్టీని పార్టీ కార్యకర్తలను చంద్రబాబుకు తాకట్టు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకి వయస్సు అయిపోయింది కాబట్టే పవన్ కళ్యాణ్ ఆయన తరుపున యాత్ర సాగిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి విమర్శించారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో తక్కువ ఛార్జీలు ఉండడం వల్లే బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని మాట్లాడటం పూర్తి అవివేకమని, పోర్టు విషయాలు ఇంకా లోతుగా తెలుసుకుని మాట్లాడాలి. మతి లేని విమర్శలకు దిగవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబుతో ప్యాకేజి కుదరలేదా మళ్లీ రోడెక్కావు’ అని ఎద్దేవా చేశారు.

