ఆర్డీవో కారుని ఎత్తి కుదేశారు..పోలీసుల్ని సైతం ఘోరావ్ చేశారు
వాళ్లు మామూలోళ్లు కాదు గురూ…అనుకునేలా చేశారు.లగచర్ల ఘటన మరువక ముందే తెలంగాణాలో మరో ఉద్యమ ముసలం పుట్టింది.ఇది అలాంటి ఇలాంటి ఉద్యమం కాదు…పోలీసుల్ని సైతం ఘోరావ్ చేశారు.ఆర్డీవో కారునైతే ఏకంగా ఎత్తిపడేశారు. చచ్చిపోతున్నాను రా మొర్రో అంటున్నా వినిపించుకోలేదు…చస్తే ఇక్కడే చావ్ అంటూ ఆర్డీవోని కూడా నిర్బంధించారు.ఊహకందని ఈ ఉద్యమం దిలావర్‌పూర్ లో జరిగింది.నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుని నిరశిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని కోరింది. చిక్కిందే ఛాన్స్ అనుకుని అలా వచ్చిన ఆమెని 6 గంటల పాటు నిర్బంధించారు రైతులు. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.ప్రాణాలు పోయేలా ఉన్నాయి…వదిలిపెట్టండి అని మొత్తుకున్నా రైతులు వినిపించుకోలేదు.దీంతో పోలీసులు అతికష్టం మీద రైతులను అడ్డుకుని స్వయంగా ఎస్పీనే తన కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలా వెళ్లారో లేదో…ఆర్డీవో కళ్యాణి కారుపై తమ ప్రతాపం చూపారు.కారును ఎత్తి కుదేశారు.ధ్వంసం చేశారు. 128 రోజులుగా చేస్తున్న తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయగా అయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్లపైకి వచ్చి పోలీసుల వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ తరలించేంతవరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదని హెచ్చరించారు.దీంతో ఈ ఘటన లగచర్ల మించి ఉంటుందని గ్రహించిన అధికారులు…ఆందోళనా కారులకు ఆమడ దూరంలో ఉంటూ పర్యవేక్షిస్తుండటం గమనార్హం.