” రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు “
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టి, ఇప్పుడు ఆదాయ వనరుగా మద్యం అమ్మకాలనే నమ్ముకుంటోందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలో ప్రతి పల్లెకు ప్రగతి చక్రాలు నడిచాయని, ప్రతి ఇంటికి తాగునీళ్లు, ప్రతి చేతికి పని, ప్రతి భూమికి సాగునీరు అందిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే రాష్ట్రం మద్యం దుకాణాలతో నిండిపోయిందని, “ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని” విమర్శించారు. కేటీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి మద్యం కోసం చేసే సగటు ఖర్చు గతంలో రూ.897గా ఉండగా, కాంగ్రెస్ పాలనలో అది రూ.1623కు పెరిగిందని పేర్కొన్నారు. వైన్స్ దుకాణాల లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచడమేగాక, దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచిన విధానాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, అధికారం చేతికొచ్చిన తర్వాత అదే మార్గాన్ని వెంబడిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది “ఇందిరమ్మ రాజ్యం కాదు, మద్యం రాజ్యం”గా మారుతోందంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్, రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, కేవలం ఖజానా నింపే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు సాగుతున్నాయని అన్నారు.
Breaking news: ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి