‘కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది వారే’.. బీజేపీ ఎంపీ
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్‌కు పాల్పడింది బీఆర్‌ఎస్ కార్యకర్తలే అన్నారు మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ నుండి డబ్బు తీసుకున్నవారే ఇలాంటి పని చేశారని, హరీశ్ రావు కేవలం ట్వీట్ పెట్టి ఊరుకున్నారని మండిపడ్డారు. ట్రోలింగ్‌పై క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారిక కార్యక్రమం అయిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టులు పెడతారా అంటూ మండిపడ్డారు. అక్కడ మంత్రిగా కొండా సురేఖ, ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కే చెందిన ప్రభాకర్ రెడ్డి ఉన్నామని పేర్కొన్నారు. వేలాదిమందిలో జరిగిన కార్యక్రమాన్ని బూతద్దంలో చూపించి, విమర్శలు చేస్తుంటే బాధనిపిస్తోందన్నారు. ట్రోలింగ్ చేసిన వారిపై ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని, మర్యాదగా వారినే తప్పు ఒప్పుకోవాలని హెచ్చరించారు. ఈ విషయంపై కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలన్నారు. అక్కకు జరిగిన అవమానంపై తమ్ముడిలా నేను పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు లాగుతా అంటూ మండిపడ్డారు.


 
							 
							