వంశీని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు….అందుకే అలా జరిగింది
టిడిపి అధికార ప్రతినిధి,న్యాయవాది కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దురుద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టిన ఫలితంగానే టిడిపి,వైసీపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.మంగళవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైల్లో జగన్ ములాఖత్ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ…తమ ప్రభుత్వ హయాంలో టిడిపి వారు ఇచ్చిన ఫిర్యాదులు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారని,కానీ ఆనాడు టిడిపి వాళ్లు వంశీ పేరుని ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు.అప్పుడు లేని పేరు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది చంద్రబాబు అని సీఎంని సూటిగా ప్రశ్నించారు.టిడిపి వాళ్లు చెప్తున్నట్లు గన్నవరం టిడిపి కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించినది కాదని అగ్రవర్ణాల పేరుతో రిజిస్టర్ అయ్యిందని తెలిపారు.పట్టాభితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఎస్సీ,ఎస్టీలపై దాడులకు తెగబడ్డారని వాటిని నిలువరించే క్రమంలో గొడవ జరిగిందని ఆ నాడు దానికి సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారని తెలిపారు.అయితే ఫిర్యాదులో 71వ నిందితునిగా ఉన్న వంశీని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో నిర్భందించారన్నారు.వంశీ ఎలాంటి తప్పు చేయలేదని సత్యవర్ధన్ చెబుతున్నప్పుడు….ఆయన్ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.వంశీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.

