రోదసిలో సునీత చేసిన పనులు ఇవే..
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు వారం రోజుల కోసం వెళ్లి, అనివార్య కారణాల వల్ల 9 నెలలు ఉండిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ అక్కడ ఏం సాధించారు. ఊరికే ఖాళీగా ఉన్నారా అనే అనుమానాలు వస్తూంటాయి. అయితే వీరు అక్కడ అనేక పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష కేంద్రంలో రోజువారీ నిర్వహణ పనులు చురుగ్గా చేసారు.అక్కడి శాస్త్రీయ పరిశోధనలలో పాలు పంచుకున్నారు. వీరు 150కి పైగా ప్రయోగాలు చేశారు. దీనిలో అంతరిక్ష వ్యవసాయం, భార రహిత స్థితిలో మానవుల శారీరక ఆరోగ్యంపై పలు ప్రయోగాలు ఉన్నాయి. అక్కడి అడ్వాన్స్‌డ్ ప్లాంట్ హ్యాబిటెట్‌లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. తేమలో వచ్చే మొక్కలు, నీటి వ్యవస్థలలో సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందని పరిశోధించారు. అంతరిక్ష కేంద్రానికి ఎన్నో మరమ్మతులు కూడా చేపట్టారు. ఐఎస్‌ఎస్ వెలుపల పలు పరికరాలు అమర్చారు. ఈ పనిలో భాగంగా ఐదు గంటల 26 నిమిషాలు స్పేస్ వాక్ నిర్వహించారు. ఈ స్పేస్ వాక్‌తో కలిపి ఆమె మొత్తం 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించారు. తద్వారా సుధీర్ఘ సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. సాసా యాంటినాను వెనక్కి తెచ్చారు. డాకింగ్ అడాప్టర్‌కు రిఫ్లెక్టర్‌ను అమర్చారు. ఈ పనులే కాదు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు కూడా వేశారు. నాసా కంట్రోల్ మిషన్ నుండి పంపిన ఎన్‌క్రిప్టెడ్ బ్యాలెట్‌లో ఓటు వేసి, దానిని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు.
