రెండో మాటే లేదు…కూల్చేయడమే
హైద్రాబాద్ ( జీహెచ్ఎంసి) పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేస్తామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని రంగనాథ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పవని స్పష్టం చేశారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని ఆయన తెలిపారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదని చెప్పారు. పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. చెరువుల సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువు ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తుందన్నారు.