“తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు”:డిప్యూటీ సీఎం
తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఋతుపవనాలు బలంగా వీచాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుని ప్రార్థించాను అని తెలిపారు. కరువు కాటకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలనన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని భట్టి పిలుపునిచ్చారు. ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సార్ధక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. కాగా అమర జీవులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు.అయితే 2029-30 వరకు కావలసిన విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉందని భట్టి విక్రమార్క తెలిపారు.