ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు తేలాల్సిందే
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో నిజానిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణ అత్యంత పారదర్శకగా సాగుతోందని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉందని , అయితే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ స్థాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది చట్టప్రకారం తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
కేవలం అధికారుల ప్రమేయంతోనే ఇంతటి భారీ ఉల్లంఘనలు జరగవని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా ఇది సాధ్యం కాదని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైన ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంటుందని, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తు చేశారు. బాధ్యులెవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికే అధికారులు విచారణ వేగవంతం చేశారని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొనడాన్ని ఆయన స్వాగతించారు.

