NationalNews

సుప్రీం కోర్టులో మూడోసారి మహిళా ధర్మాసనం

భారత సుప్రీం కోర్టు చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఏర్పాటు చరిత్రలోనే మూడోసారి మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన మహిళా బెంచ్‌ను సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌ వైవాహిక గొడవలకు సంబంధించి 10 బదిలీ పిటిషన్లు, మరో 10 బెయిల్‌ పిటిషన్లను విచారించనుంది. 27 మంది న్యాయమూర్తులు కలిగి ఉన్న సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు (జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ బేలా త్రివేది) ఉన్నారు.

సీజేఐగా జస్టిస్‌ నాగరత్న..

2013లో తొలిసారి జస్టిస్‌ జ్ఞాన సుధామిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశాయ్‌లతో కూడిన మహిళా ధర్మాసనం తొలిసారి ఏర్పాటైంది. నాటి ప్రిసైడింగ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనాన్ని యాధృచ్చికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 2018లోనూ జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో మహిళా బెంచ్‌ ఏర్పాటైంది. జస్టిస్‌ బి.వి.నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా పని చేయనున్నారు. దీంతో భారత్‌లో తొలి మహిళా సీజేఐగా గుర్తింపు పొందనున్నారు.