పంచాయితీ పోరుకు రంగం సిద్ధం
తెలంగాణ లో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడుత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి.షెడ్యూల్ విడుదల కావడంతో మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిణి రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.

