Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, విపక్ష పార్టీలు

• అధికార పార్టీకి సెమీఫైనల్స్ గా నిలవనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
• విజయం కోసం ప్రధాన పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు
• ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలే టార్గెట్

ఏపీలో ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు కీలకంగా ఉన్నాయి. మొత్తం 23 స్థానాలకు గాను స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు అధికార పార్టీకి నల్లేరు మీద నడకే. ఇప్పటికే ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో అభ్యర్థుల గెలుపుకు డోకా లేదు. కానీ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో జరగనున్న ఎన్నికలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్యేకించి ఈ ఐదు నియోజకవర్గాలపైనే ప్రధాన పక్షాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల ఏడాది కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైయస్సార్సీపీ ప్రభుత్వం పై తరచూ విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా ప్రభుత్వం పై ప్రజలకున్న వ్యతిరేకతను రుజువు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.

కానీ అధికార పక్షం మాత్రం ఆ ఐదు ఎమ్మెల్సీ నియోజకవర్గాలు కూడా గెలుచుకొని విపక్ష పార్టీలు చెప్పే వ్యతిరేకత లేదని చెప్పేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు మంత్రులకు అధికార పార్టీ అప్పగిస్తే విపక్ష పార్టీలు కీలక నేతలకు ఆ బాధ్యతలను అప్పగించాయి. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో అధికార వైయస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను పోటీలో నిలపగా, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపీ, పిడిఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పుడు వీరు గెలుపు కోసం కీలక నేతలు రంగంలోకి దిగి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెక్ పెట్టడం ద్వారా ఇప్పటివరకు తాము చేసిన ఆరోపణలు ప్రజలు విశ్వసించినట్లు చెప్పటంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు గట్టు పట్టుదలతో ఉన్నాయి. మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్లాలంటే మిగతా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ప్రధానమైన ఈ అయిదు ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవడం ద్వారా ప్రభుత్వం పై ప్రజల వ్యతిరేకత విపక్ష పార్టీల సృష్టి అని చెప్పేందుకు వైఎస్ఆర్సిపీ సిద్ధమైంది.

ఏ ఒక్క స్థానం చేజారకుండా ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా మంత్రులు కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలపుపై సీట్ల ఖరారు కూడా ఆధారపడి ఉంటుందనే భావనతో ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంది వచ్చిన ఏ అవకాశం జారవిడుచుకోకుండా అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార వైఎస్ఆర్సిపీ, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ఐదు నియోజకవర్గాల గెలుపోటములు మరో కొన్ని రోజుల్లో తేలనుంది.