చిన్నారిని చిదిమేసిన రాకాసి బస్సు
“కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం” అన్నాడో మహాకవి. అది అక్షరసత్యం. రోడ్డు ప్రమాదాల విషయంలో ఈ విషయం కళ్లముందు రుజువవుతుంది. అప్పటి వరకూ తనతో సరదాగా మాట్లాడుతూ అల్లరి చేసిన చిన్నారి తండ్రిని, తల్లి కళ్లముందే హఠాత్తుగా మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన విశాఖపట్నం ఉక్కునగరం సమీపంలో జరిగింది. మంగళవారం ఉదయం అగనంపూడి సమీపంలో ఉంటున్న పెరుమాళ్ల సౌజన్య కుమారుడు, పెరుమాళ్ల ఎలీజా సావెరిన్ ఉక్కునగరంలోని డి.పాల్ పాఠశాలలో మూడవతరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే చక్కగా తయారయి, ద్విచక్రవాహనంపై స్కూలుకు బయలుదేరారు తల్లీకొడుకులు. ఇంతలో పరవాడలోని ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సంస్థకు చెందిన రాకాసి బస్సు వారిని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఇద్దరూ చెరోవైపూ ఎగిరి పడ్డారు. చిన్నారి ఎలీజా తలపై బస్సు చక్రాలు ఎక్కడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవరు, ఇతర ఉద్యోగులు పరారయ్యారు. దీనితో ఆగ్రహం చెందిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేసి బస్సును ధ్వంసం చేశారు. ప్రధాన రహదారి కూడలి వద్దకు, భారీ వాహనాలను, ఫార్మా సంస్థల బస్సులను అనుమతించరాదని నినాదాలు చేసారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ప్రైవేట్ సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకుని స్కూలు వద్ద వాహనాల రాకపోకలు సక్రమంగా చూసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
పోలీస్ ఉన్నతాధికారులు, తల్లిదండ్రులతో మాట్లాడి, చిన్నారి తల్లిదండ్రులకు పరిహారం ఇచ్చేందుకు పాఠశాల యాజమాన్యం, ఫార్మా సంస్థ యాజమాన్యం చేత లిఖిత పూర్వక హామీ ఇప్పించారు.
అయితే సౌజన్య భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, ఆమె కుమారుడు, తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ ఉంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండడంతో ఆతల్లి శోకాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. ‘మాకు కన్నీళ్లే మిగిల్చావా కన్నా’ అంటూ ఆక్రోశిస్తుంటే చూసేవారి గుండెలు ద్రవించి పోయాయి.

