ఉత్తేజ భరితంగా సాగిన ప్రధాని ప్రసంగం…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప యాత్ర సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడంతో కాషాయ దళంలో కొత్త జోష్ కొట్టొచ్చినట్టు కనబడింది. ఉత్తేజ భరితంగా సాగిన ప్రసంగం శ్రేణులను ఆకట్టుకుంది. నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. సభలో మోడీ ప్రసంగిస్తున్నంత సేపు మోడీ మోడీ అంటూ జయ జయ ధ్వానాలతో హోరెత్తించారు. చెరకు పంట సాగు చేయడంతో పాటు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండడంతో కామారెడ్డి పరిసర ప్రాంత రైతుల కృషిని ప్రధాని అభినందించారు. చెరకు మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు మృదుస్వభావులని పేర్కొన్నారు. దేశంలో సుపరిపాలన ప్రధాని మోడీతోనే సాధ్యమని ఖేడ్ బీజేపీ అభ్యర్థి జన్‌వాడే సంగప్ప పేర్కొన్నారు. తెలంగాణాలో ఈసారి బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. ప్రజలారా ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి మేం ఏమిటో నిరూపించుకుంటాం అంటూ బీజేపీ తరఫున ప్రధాని కమలం పువ్వు గుర్తుపై ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించారు.