Home Page SliderTelangana

ఈ నెల 28న రానున్న రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

ఈ నెల 28వ తేదీన రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రానికి తన ఒకరోజు పర్యటన సందర్భంగా, రాష్ట్రపతి ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని ఆమె తెలియజేశారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను కోరారు. అదేవిధంగా, విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. అదేవిధంగా, రాష్ట్రపతి కాన్వాయ్ ఉపయోగించాల్సిన రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, GHMC అధికారులతో సమన్వయంతో చేపట్టాలని R&B శాఖకు ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచాలని, అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖను ఆదేశించారు. రాష్ట్రపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు.