హస్తం పార్టీ అఖండం విజయం.. కానీ, షెట్టర్ ఓడారు
కర్నాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధిస్తే… ఒక ఓటమి ఆ పార్టీకి ఆందోళన కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారి, అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ లింగాయత్ నాయకుడు, షెట్టర్ హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 30,000 ఓట్ల తేడాతో బిజెపికి చెందిన మహేష్ తెంగినాకై చేతిలో ఓడిపోయారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షెట్టర్ గత నెలలో కాంగ్రెస్లో చేరారు. బీజేపీ ట్రీట్మెంట్ కారణంగానే తాను ఆ పార్టీని విడిచిపెట్టానని చెప్పారు.

షెట్టర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. షెట్టర్ కాంగ్రెస్లోకి ప్రవేశించడం వల్ల దక్షిణాది రాష్ట్రంలో పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందన్నారు. అయితే, షెట్టర్ విజయం సాధించడంలో విఫలమవుతారని బిజెపి ముందుగానే పేర్కొంది. షెట్టర్ బీజేపీ వదలి తప్పు చేశాడని మాజీ సీఎం యడ్యూరప్ప సైతం విమర్శించారు. రాజ్యసభ సభ్యత్వానికి హామీ ఇచ్చామని, కేంద్రంలో మంత్రిని చేస్తామన్నా, ఆయన పార్టీ వీడారన్నారు. అమిత్ షా స్వయంగా షెట్టర్తో మాట్లాడారన్నారు. పార్టీని వీడి తప్పు చేశాడన్నారు యడ్యూరప్ప.