ఆసుపత్రి నుంచి అనాథ శిశువు డిశ్చార్జ్.. కంటతడి పెట్టిన సిబ్బంది..
ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ వైద్య కళాశాల నుంచి ఓ అనాథ శిశువు డిశ్చార్జి అవుతుంటే ఆసుపత్రిలోని సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. రెండు నెలలపాటు శిశువును కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. డిశ్చార్జి అనంతరం అధికారులు ప్రయాగ్జ్ శిశు సంరక్షణ కేంద్రానికి శిశువును తరలిస్తున్నపుడు కన్నీటిపర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు నెల 26వ తేదీన శిశువును యూపీలోని హమీర్ పూర్ లో వంతెన పైనుంచి ఎవరో కిందికి విసిరేశారు. చెట్ల కొమ్మల నడుమ చిక్కి ఒళ్లంతా గాయాలైన రెండు రోజుల పసికందును కుక్కలు కూడా కరిచాయి. దాదాపు 50 గాయాలతో చావుబతుకుల మధ్య ఉన్న చిన్నారిని పోలీసులు కాన్పుర్ వైద్య కళాశాలకు తరలించారు. నాటి నుంచీ వైద్యుల పర్యవేక్షణలో శిశువుకు చికిత్స కొనసాగించారు. ఆక్సిజన్ సిలిండరు పెట్టి, ట్యూబు ద్వారా ఆహారం అందించారు. నర్సులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రెండు నెలల్లో శిశువు పూర్తిగా కోలుకుంది. గత రెండు నెలలుగా ఆ చిన్నారితో పెనవేసుకున్న అనుబంధాన్ని, మంత్రముగ్ధమైన అతడి చిరునవ్వును తలచుకొని శిశు సంరక్షణ కేంద్రానికి బాబును తరలిస్తున్నపుడు ఆసుపత్రి సిబ్బంది కంటతడి పెట్టారు.

