సర్కారీ బడులకు విద్యార్థుల కరువు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరకాలంలో దాదాపు 3.98 లక్షలమంది విద్యార్థులు తగ్గినట్లు ప్రభుత్వమే తెలియజేస్తోంది. సోమవారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కరోనా కారణంగా చాలామంది ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్చారని, దానివల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. కానీ చాలామంది మరలా వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. విచిత్రం ఏమిటంటే జననాల రేటు తగ్గడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గుతున్నాయని చెప్తున్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో ఎలా పెరుగుతున్నారో?

చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాల పనికిరాదనే ప్రజల ఆలోచనాతీరులో కూడా మార్పు రావాల్సి ఉంటుంది. చదువుకి, వైద్యానికి ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు పనికిరావు. కానీ ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వ రంగంలో కావాలి. ఇది చాలామంది మనోభావం. సరైన మౌలికవసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు కూడా ఏమాత్రం తీసిపోవు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. పల్లెటూళ్లలో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువ, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల చాలా స్కూళ్లను మూసివేయడం, దగ్గర ప్రాంతాలలోని పాఠశాలలను విలీనం చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి.

విద్యార్థుల ఆధునిక విద్యకు కావలసిన సదుపాయాలను కలిగించడం. పాఠశాల భవనాలను మరమ్మత్తులు చేయించడం వంటి పనుల ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించవచ్చు. భోజన పథకం సరిగ్గా అమలు చేయడం, కంప్యూటర్ విద్యను అందించడం కూడా విద్యార్థుల సంఖ్యను పెంచే దారులే. ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల కూడా కొంత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ఇటీవల కర్నూలులోని ఒక ఐఏఎస్ అధికారి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నామని తెలిపారు. మన సర్కారీ బడుల్ని మనమే కాపాడుకోవాలి.

