IMA పిలుపుతో అట్టుడుకుతున్న దేశం
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. IMA పిలుపుతో దేశవ్యాప్త బంద్‌కు భారత్ నడుం బిగించింది. ‘మహిళా వైద్యుల మాన ప్రాణాలకు రక్షణ లేదంటూ’ వైద్యవిద్యార్థులు, వైద్యులు నినాదాలు చేస్తున్నారు. ఆగస్టు 9న జరిగిన ఈ చర్య వలన వివిధ రకాలుగా గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఇప్పటి వరకూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసు విషయంలో నిందితులను కనిపెట్టలేకపోవడంతో వారు సమ్మెకు దిగారు. ‘అంతం కాదిది ఆరంభం అంటూ, ఇంకెన్నాళ్లీ మౌనం’ అంటూ రోడెక్కుతున్నారు.

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున వైద్యులు నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, విద్యార్థులు, వైద్యులు అందరూ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వైద్యులే కాక సాధారణ పౌరులు సైతం ఈ ఉద్యమంలో భాగంగా మారారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పేషెంట్ల ప్రాణాలను కాపాడే వైద్యులకే రక్షణ లేకపోతే ఎలా?’ అంటూ ఆందోళనకు దిగారు. “మీడియాలలో అశ్లీలతను అరికట్టలేని ప్రభుత్వాలు మాకొద్దు” అంటూ నినాదాలు చేస్తున్నారు. కేవలం ఎమర్జెన్సీ సేవలు తప్ప ఇతర ఓపీ సేవలకు హాజరు కాబోయేది లేదంటూ తెగేసి చెప్పారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రి,పగలు తేడా లేకుండా 24 గంటల పాటు వైద్యసేవలలో పని చేస్తూ ఉంటారని, వారికి తగిన రక్షణ కల్పించకపోతే తాము వైద్యసేవలు ఎలా కొనసాగించగలమని ప్రశ్నిస్తున్నారు.

