సమంతను రాళ్లతో కొట్టడం వల్లే ఆ సినిమా ప్లాపయ్యింది
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో సమంత ముఖ్యపాత్రలో విడుదలైన పౌరాణిక చిత్రం శాకుంతలం అనుకున్నంత ఫలితాన్ని సాధించలేదు. ఈ చిత్రంలో శకుంతల పాత్రధారి సమంతను రాళ్లతో కొట్టినట్లు చూపించడం వల్లే ఈ చిత్రం సరిగా ఆడలేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించిందని, కథ, కథనాలు చాలా బాగున్నాయని ఆయన చెప్పారు. ఈ చిత్రం మహాకవి కాళిదాసు రచించిన కావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించబడింది.

తాను తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసే వాడినని, అప్పట్లో ఈ శాకుంతలం నాటకం చూసానని అన్నారు. దానితో శకుంతల ఎలా జన్మించింది?. దుష్యంతుడు, శకుంతల పరిణయం, దుష్యంతుడు, శకుంతలను ముని శాపం కారణంగా మరిచి పోవడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ సందర్భంలో గర్భవతిగా ఉన్న శకుంతల దుష్యంతున్ని చేరుకోవడం, అతడు ఆమెను మరచిపోవడంతో గ్రామస్థులు ఆమెను రాళ్లతో కొట్టినట్లు కొన్ని సీన్స్ ఈచిత్రంలో ఉన్నాయి. స్త్రీలకు ఈ చిత్రం చేరువ కావాలని అలాంటి సీన్ పెట్టి ఉండొచ్చన్నారు. కాళిదాసు కథలో అటువంటివి లేవు. మహాభారతంలో కూడా అలాంటి సన్ని వేశాలు లేవు. శకుంతల భరతునికి జన్మనివ్వడం, భరతుని పేరుతో భరతవంశం ఏర్పడడం వంటి కథలు ఉన్నాయి. చిత్ర దర్శకుడు గుణశేఖర్ గొప్ప దర్శకుడని, అతడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.

