నెల్లూరు జిల్లాలో బాలికపై అత్యంత అమానుష చర్య
కొన్ని సంఘటనలు చూస్తే, మనం మనుషుల మధ్యే ఉంటున్నామా? లేక అడవి మృగాల మధ్యనా? అనే అనుమానాలు కలుగుతాయి. అడవి జంతువులైనా ఆకలివేస్తేనే వేటాడుతాయి. మానవమృగాలు అలాకాదు. కామంతో కళ్లు మూసుకుపోయి, చిన్నపిల్లలని కూడా కనికరం లేకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నాయ్. నెల్లూరులో మృగాడు చెలరేగిపోయాడు. ఓ ఇంట్లో నిన్నసాయంత్రం (సోమవారం) ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి, గొంతుకోసి పరారయ్యాడు. అత్యంత హేయమైన ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఈ బాలిక నెల్లూరు సమీపంలోని ప్రభుత్వపాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సాయంత్రం పనిమీద బయటకు వెళ్లారు.

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ఆందోళనతో బాత్‌రూంలో ప్రవేశించగా, కోపంతో నిందితుడు ఆమె నోట్లో యాసిడ్ పోసి, కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి చూడగా, బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి, నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు దగ్గర బంధువే అయి ఉండొచ్చని, ఎవరైనా అతనికి సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఎస్పీ విజయరావు, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నిన్న రాత్రి పరామర్శించారు.