శివ-కేశవులు అనుగ్రహించే కార్తీక మాసం
. హిందువులకు పవిత్ర మాసం
. శివకేశవులకు ప్రియమైన కార్తీక మాసం
. కార్తీకంలో పండుగలు
. దీపారాధన, దీపదానం
హిందువులకు కార్తీకమాసం పరమపవిత్రమైన విశేష మాసం. ఈ నెలలో కొన్ని పూజలు, పద్దతులు, పరిహారాలు పాటిస్తే శివ- కేశవులిద్దరూ అనుగ్రహిస్తారు. ఈ నెలలో దీపాలు వెలిగించడం, స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు చేయడం ఎంతో పుణ్యప్రదం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని దేవతల మాసం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా కార్తీకమాసం దీపాలకు ప్రాముఖ్యత ఎక్కువ. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్న పౌర్ణమి అవడంతో “కార్తీకమాసం” అని ఈ నెలకు పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం కనుక ఈ నెలలో దీపదానం చాలా మంచిది. కార్తీకమాసం నెల్లాళ్ళు కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. అదే విధంగా ఆలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది. సూర్యోదయం ముందు, సంధ్య సమయంలో దీపారాధన చేయడం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు.
దీపాలను వెలిగించడమే కాదు, దీపదానం చేస్తే కూడా మంచిది. చాలామంది రకరకాల దానాలు కూడా కార్తీకమాసంలో చేస్తూ ఉంటారు. బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలతో కలపాలి. ఆ తర్వాత దానితో ప్రమిద చేయాలి. అందులో దీపం వెలిగించి దానం చేయాలి. ఒకవేళ బియ్యం పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో కూడా అదే విధంగా దీపం వెలిగించి, స్వయంపాకం దక్షిణ పెట్టి దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. దీపాన్ని వెలిగించాక పసుపు, కుంకుమ, పూలతో దీపాన్ని అలంకరించండి.
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కోట దగ్గర శివాలయంలో లేదా వైష్ణవాలయంలో దీపారాధన, దీపదానం చేయడం మంచిది. ఒక వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. నాలుగు వత్తులతో దీపదానం చేస్తే రాజు అవుతారు. పది వత్తులతో దీపదానం చేస్తే విష్ణు సాహిత్యం పొందుతారు. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే విష్ణురూపుడు అవుతారు. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయని వ్యాస మహర్షి చెప్పారు. అదే విధంగా నువ్వుల నూనెతో దీప దానం చేయడం వలన కీర్తి లభిస్తుంది. విప్ప నూనె, ఆముదం, అవిసె నూనె, బర్రె నెయ్యితో దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనెలో కాస్త ఆవు నెయ్యి కలిపితే దోషాలు ఉండవు.
ఏకాదశి ఉపవాసం, తులసి పూజలు, శివలింగాభిషేకం ఈ నెలలో ఎంతో పుణ్యం కలిగిస్తాయని పండితులు చెప్తుంటారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజున గంగా స్నానం, దీపదానం, అన్నదానం, శివపూజ, సత్యనారాయణ వ్రతం వంటివి చేస్తారు. నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి లేదా తులసి వివాహం, కార్తీక పౌర్ణమి, దీపోత్సవాలు ఈ నెలలో పండుగలు.
కార్తీకమాసం కృత్యానాం కోటి జన్మార్జితైః పుణ్యైః లభ్యతే” అని నానుడి. అంటే కార్తీకమాసంలో ఒక్క మంచి కార్యం చేసినా, అది లక్ష జన్మల పుణ్యానికి సమానం అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.