మిషన్ భగీరథ పథకం లక్ష్యం వృథా…
కోరుట్ల: కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటింటికీ శుద్ధజలం (మంచినీరు) అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. కోరుట్లలో సుమారు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు రెండేళ్ల క్రితం అర్బన్ మిషన్ భగీరథ పథకంలోని అన్ని కాలనీల్లో కొత్తగా ప్రధాన పైప్‌లైన్లు వేశారు. అంతర్గత పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ ప్రత్యేక పైపులను అమర్చి కుళాయిలను బిగించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ గుత్తేదారు ఇంటింటికీ పైప్‌లైన్ వేసి బిగించిన కుళాయిని తొలగించడంతో నీరు వృథాగా పోతోంది. పైపులను చాలాచోట్ల మురుగు కాలువలో, రోడ్లపై పడేస్తున్నారు. చాలాచోట్ల పైప్‌లైన్లకు పగుళ్లు వచ్చి లీకేజీలు ఏర్పడ్డాయి. తారు రోడ్డుపై నీరు ప్రవహించడంతో రోడ్డు గుంతల మయం అయ్యే ప్రమాదం ఉంది. ఇళ్ల ముందున్న పైపులకు కుళాయిలను అమర్చి భగీరథ నీరు వృథాగా పోకుండా అరికట్టాల్సిన బల్దియా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

