‘మంత్రి నిజం చెప్పేశారు’..కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. కొండా సురేఖ నిజం చెప్పేశారని, మంత్రులు కమిషన్ తీసుకోకుండా సంతకాలు చేయట్లేదని ఒప్పుకున్నారని సెటైర్లు వేశారు. మంత్రుల కమిషన్ వ్యాపారంపై ఆందోళన చేస్తూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాలు కూడా చేశారని పేర్కొన్నారు. నిజం ఒప్పుకున్న అదే నోటితో కమిషన్ తీసుకుంటున్న మంత్రుల పేర్లు కూడా చెప్పాలని ఆమెను కోరారు. ‘సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగలరా?’ అంటూ సవాల్ చేశారు. గురువారం వరంగల్ లోని క్రిష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ. 5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాను’. అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.