మూడు రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా!
ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయా వర్గాల్లో విసృత ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది.

అయితే అదే సందర్భంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా మెరుగైన విధంగా మూడు రాజధానుల బిల్లు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండుమూడు రోజుల నుండి మంత్రి గుడివాడ అమరనాథ్ తో సహా పలువురు మంత్రులు మూడు రాజధానుల ఏర్పాటే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేయడంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీకి బలం లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఇప్పుడు శాసనమండలిలోనూ అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఉభయ సభల్లో మూడు రాజధానుల అంశానికి సంబంధించి కొన్ని మార్పులతో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించుకునే అవకాశం ఉందని సమాచారం.ఇదే సమావేశాల్లో మరి కొన్ని కీలక బిల్లులను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) లో గతంలో సభ్యులుగా వ్యవహరించిన కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్.. మంత్రి పదవులను కోల్పోవడంతో వారి స్థానల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జోగి రమేష్ నియమితులయ్యారు.

