సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో సినిమా టికెట్ ధరల ఇష్టారాజ్య పెంపుదలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే అధికారికంగా ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది.
గతంలో టికెట్ ధరల పెంపుపై కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి రేట్లు పెంచుకునేలా మెమో జారీ చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని, ధరల పెంపు వివరాలను దాచిపెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వినిపించిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
కేవలం మెమోల ద్వారా సినిమా బడ్జెట్ వివరాలను ధృవీకరించకుండా ధరలు పెంచడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. ఇకపై ధరల నిర్ణయం ఏదైనా తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 మరియు గతంలో జారీ చేసిన జీవో 120 నిబంధనలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు జీవోలు జారీ చేయడం వల్ల సామాన్య ప్రేక్షకులు న్యాయపోరాటం చేసే అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఇకపై 3 నెలల ముందే ధరల పెంపుపై స్పష్టత ఉండాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు పెద్ద ఊరటనివ్వగా, సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది.

