వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు..
తెలంగాణలోని కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పుష్కరాలను నేడు మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా నేడు సాయంత్రం 4.30గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించనున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు. సరస్వతి నది ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. ఈ వేడుకల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.35 కోట్లను కేటాయించింది. భక్తుల వసతి కోసం 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తున్నారు. సరస్వతి దేవి 10 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అలాగే పుష్కరాల కోసం రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్లు, పార్కింగ్ ఏర్పాట్లన్నీ చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానం చేసి, ప్రత్యేక పూజలు చేశారు.


