రైతులపై ప్రభుత్వం కపటప్రేమ..జగన్
ఏపీలోని రైతులపై ప్రభుత్వం కపటప్రేమను చూపిస్తోందని, కానీ వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు కురిపించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్. నేడు వైసీపీ నేత జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం తాను పోరాటం చేస్తానన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేశారని, రైతులకు సున్నావడ్డీ రుణాలు కూడా అందడం లేదని ఆరోపించారు. ఈ సారి వచ్చే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనని మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం చూస్తామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా అనంతపురం జిల్లా, వైఎస్సార్ జిల్లాలలో అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు బాగా దెబ్బతిన్నాయి.