crimeHome Page SliderNationalNews

టెన్నిస్ క్రీడాకారిణిని షూట్ చేసిన తండ్రి.. ఇదే కారణమా..?

హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె కన్న తండ్రే కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25) గురుగ్రామ్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం రాధిక ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి వచ్చి, ఆమె పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు. “ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. కుటుంబ సభ్యులను విచారిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి” అని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె సంపాదనపై ఆధారపడి బతుకుతున్నానంటూ కుమార్తె తరచూ అవహేళన చేసేదని, అందుకే ప్రాణాలు తీశానని దీపక్ యాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. రాధిక టెన్నిస్ అకాడమీని నిర్వహించడం తండ్రికి ఇష్టం లేకపోవడమే వారిద్దరి మధ్య ఘర్షణకు కారణమని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, రాధిక మ్యూజిక్ రీల్స్ చేయడం కూడా ఆమె తండ్రికి ఇష్టం లేదని, ఇది కూడా హత్యకు ఓ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ ఆమె అవహేళన చేయడంతోనే దీపక్ హత్యకు పాల్పడ్డారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, దీపక్ కు అద్దెల రూపంలోనే నెలకు రూ.17 లక్షల ఆదాయం వచ్చే ఆస్తులు ఉన్నాయని ఆయన పరిచయస్థులు చెప్తున్నారు. లగ్జరీ ఫామ్ హౌస్ సహా పలు రకాల ఆస్తులున్న ఆయన కుమార్తెను హత్య చేయడానికి వేరే కారణాలున్నాయని అనుమానిస్తున్నారు.