‘అంతం కాదిది ఆరంభం.. మనం ఏప్రిల్ ఫూల్స్ కాదు’.. ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. పదవి చేపట్టిన ఆరు వారాలలో అమెరికా కోసం తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గురించి ఏకరువు పెట్టారు. గత నాలుగేళ్లలో గత ప్రభుత్వం సాధించిన దానికంటే కేవలం 43 రోజుల్లోనే తాను అధికంగా సాధించానని చెప్పుకున్నారు. ఇది కేవలం ఆరంభమేనని, అంతం కాదని ఇంకా ఎన్నో చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కొద్ది కాలంలోనే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని, అమెరికాలో భావ ప్రకటనా స్వేచ్ఛ తిరిగొచ్చిందని పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించేది లేదని, అమెరికాకు ప్రస్తుత వ్యవస్థల వల్ల న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భారత్, చైనాలతో సహా అన్ని దేశాలపై ఏప్రిల్ 2 నుండి ప్రతీకార సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. నిజానికి ఏప్రిల్ 1 నుండే అనుకున్నా, కానీ ఏప్రిల్ ఫూల్స్ మీమ్స్ బారిన పడలేనని వ్యాఖ్యానించారు. మస్క్‌పై, తన సతీమణి మెలానియాపై ప్రశంసలు కురిపించారు.